రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుత యాసంగిలో 6,408 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా దశల వారీగా అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంగళవారం దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు ధాన్యంలో తేమ 17 శాతానికి మించకుండా, తాలు లేకుండా తీసుకువచ్చేలా రైతులను చైతన్యవంతులను చేయాలని సీఎస్ స్పష్టంచేశారు.
మిల్లర్లతో సమావేశాలకు ప్రణాళిక
ప్రస్తుతానికి నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తున్నారు. ధాన్యం సేకరించే మిల్లర్లు, స్థానిక అధికారులతో ఈ రోజు నుంచి సమావేశాలు ఏర్పాటుచేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. వచ్చే వారం నాటికి మరికొన్ని జిల్లాల నుంచి ధాన్యం విక్రయానికి వస్తాయని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల లోపే ఆయా జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.