తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ సిద్ధం' - Minister KTR latest news

ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈవో లిసా సింగ్ మంత్రి కేటీఆర్​తో సమావేశమయ్యారు. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని కేటీఆర్​ లిసా సింగ్​కు వివరించారు.

'పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ సిద్ధం'
'పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ సిద్ధం'

By

Published : Apr 15, 2022, 5:14 AM IST

భారత్​లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. గురువారం ప్రగతిభవన్​లో కేటీఆర్​తో ఆస్ట్రేలియా ఇండియా ఇనిస్టిట్యూట్ సీఈవో లిసా సింగ్ సమావేశమై తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. దేశంలో విధివిధానాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వానికి కొంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. ఆచరణ అంతా రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని లిసా సింగ్ తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.

రాష్ట్రంలో ఐటీ, లైఫ్ సైన్సెస్, రెన్యువల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆస్ట్రేలియాలోని పలు కంపెనీలు ఆశావహంగా ఉన్నాయని కేటీఆర్​కు లిసా సింగ్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తున్నామని.. వీ-హబ్ తమ భాగస్వామి అని లిసా సింగ్ వివరించారు. భారత్-ఆస్ట్రేలియాల మధ్య వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి నూతన ఒప్పందాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా.. త్వరలోనే ఒక ప్రతినిధి బృందం దేశంలో పర్యటించనుందన్న విషయంపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details