ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన నాథన్ రస్సెల్, క్రిస్టీ దంపతులకు ముగ్గురు పిల్లలు. కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని రోజులుగా వీరి కుటుంబం స్వీయ నిర్బంధంలో ఉంది. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులంతా కలిసి విమానంలో మ్యూనిక్ (జర్మనీకి చెందిన నగరం)కు వెకేషన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లోనే ఓ సెటప్‌ని సృష్టించారు. ఈ క్రమంలో రస్సెల్ ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్ పాస్‌లను కూడా ప్రింట్ చేశాడు. వీటితో పాటు ఇంట్లో ఉండే వస్తువులతోనే విమానాశ్రయ వాతావరణాన్ని తలపించేలా ప్లేన్ క్యాబిన్, సెక్యూరిటీ చెక్.. మొదలైన వాటిని కూడా అతను రూపొందించడం విశేషం. వీటికి సంబంధించిన ఫొటోలను క్రిస్టీ సోషల్ మీడియా ద్వారా పంచుకొంది. ఈ వినూత్న ఆలోచన ద్వారా తమ కుటుంబ సభ్యులంతా కలిసి 15 గంటల పాటు ఆనందంగా గడిపే అవకాశం లభించిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది.
మా లాంజ్ రూమ్‌నే క్యాబిన్‌గా మార్చాం..!
మా 16 ఏళ్ల అబ్బాయి సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రను పోషిస్తే.. మా 9 ఏళ్ల పాప మా లగేజ్‌ని తనిఖీ చేసింది. మా 14 ఏళ్ల కూతురు మమ్మల్ని విమానంలోకి ఆహ్వానించింది.
ఈ సెక్యూరిటీ గేట్ ద్వారా మేము ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లి సీట్లలో కూర్చున్నాం..!