భారత పర్యటనకొచ్చే "కంగారూ జట్టు" ఇదే.. - austrailia
ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే భారత పర్యటనకు ఆసీస్ 16మందితో కూడిన జట్టును ప్రకటించింది. కంగారూ గడ్డపై సిరీస్‌ను దిగ్విజయంగా ముగించిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న జట్టు... ప్రధాన బౌలర్లు స్టార్క్, హేజిల్‌వుడ్ లేకుండానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.
రెండు టీ20లతో పాటు ఐదు వన్డేలు ఆడేందుకు భారత్ వస్తున్న ఆస్ట్రేలియా 16 మందితో జట్టును ప్రకటించింది. ఛాతీ, భుజం నొప్పి కారణంగా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. వెన్నునొప్పితో మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండటం లేదు. సీనియర్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్‌కు బిడ్డ పుట్టిన కారణంగా టోర్నీ మధ్యలో అందుబాటులోకి వస్తాడని ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రివర్ హాన్స్ తెలిపారు.
పర్యటనకు వస్తున్న జట్టులో గత నెల ఆస్ట్రేలియాలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన 11మంది ప్లేయర్లకు చోటు లభించింది. ఆరోన్ ఫించ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24 విశాఖ పట్టణంలో జరిగే మొదటి టీట్వంటీతో టోర్నీ ప్రారంభం అవుతుంది. రెండో మ్యాచ్ 27న బెంగళూరులో జరుగుతుంది.
ఐదు వన్డేల్లో మొదటి వన్డే మార్చి 2న హైదరాబాద్‌లో, రెండోది మార్చి 5న నాగ్‌పూర్‌లో, మూడోది మార్చి 8న రాంఛీలో, నాలుగోది మార్చి 10న మొహాలీలో, చివరిది మార్చి 13న దిల్లీలో జరుగుతాయి.
ఆస్ట్రేలియా జట్టు
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్, అలెక్స్ కారే, బెహ్రెన్‌డాఫ్, నాథన్ కల్టర్ నీల్, పీటర్ హాండ్స్‌కాంబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియోన్, షాన్ మార్ష్, గ్లెయిన్ మాక్స్వెల్, జ్యె రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, షార్ట్, మార్కస్ స్టోనిస్, ఆష్టన్ టర్నర్, ఆడం జంపా.