Farmers Suicide Photo Exhibition: రైతుల ఆత్మహత్యలు సహా వారి సమస్యలపై హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో ఇటీవల ప్రజాదర్బార్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో... అందరి కళ్లు చెమ్మగిల్లేలా చేసింది అరోరాస్ డిజైన్ ఇనిస్టిట్యూట్ ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రయత్నం. గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకున్న రైతుల ఫొటోలతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు అరోరాస్ విద్యార్థులు. దాన్ని చూసిన వారెవరికైనా... వ్యవసాయ రంగంలో రైతుల దుర్భర పరిస్థితులు, ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతుల కుటుంబ సభ్యుల దయనీయ జీవితాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది.
కన్నీరు పెట్టించే గాథలు
'యువ రైతు ఆత్మహత్య', 'పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య', 'అప్పులు బాధతో రైతు ఆత్మహత్య', 'కౌలురైతు కన్నీళ్లు'.. ఇలా వివిధ శీర్షికలతో వచ్చిన పత్రికాకథనాల్ని ప్రదర్శించారు. ఎర్రటి కార్డు బోర్డులపై పేపర్ కటింగ్‌లని అంటించి ప్రదర్శనకు ఉంచారు. గ్యాలరీలా కాక రైతుల దయనీయ పరిస్థితులు ప్రతింబించేలా నిజమైన కథలు, జీవిత గాధల్ని అందరికీ చేరవేసే ప్రయత్నం చేశారు.
కళ్లుచెమ్మగిల్లే ఛాయా చిత్రప్రదర్శన
రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రాంతాల వారీగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల ఫొటోలను ఏర్పాటు చేశారు. వాటి కింద రైతు పేరు, ఆ రైతుకు ఎంత విస్తీర్ణంలో భూమి ఉంది. ఏ పంట సాగు చేసి నష్టపోయారు సహా.. ఎంత అప్పుతో వారి ఉపిరి ఆగిపోయిందనే విషయాల్ని ప్రస్తావించారు. కుటుంబాల్ని అనాథలు చేస్తూ.. ప్రాణాలు వదిలిన తేదీలతో సహా పొందుపరిచిన ఛాయా చిత్ర ప్రదర్శన కన్నీరు పెట్టించింది.
'ఎంతో శ్రమకోర్చి విద్యార్థుల బృందం రూపొందించిన ఈ ప్రదర్శన... రైతు ఆత్మహత్యలకు ముఖ్య కారణాల్ని స్పష్టంగా తెలియజేసింది. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డ ఘటనల్ని, ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందని వైనాన్ని చూపించింది. ఆత్మహత్యల్లో కౌలుదారులే అధికమంటున్న విద్యార్థులు... క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందుల్ని వివరించే ప్రయత్నం చేశారు.'
-నాగప్రవీణ్ పింగళి, వైస్ ప్రిన్సిపల్