రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.‘గోల్డెన్ అవర్లోపే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేస్తోంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అధికారులు ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే కనీసం నాల్గో వంతు మరణాలను తగ్గించవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
మరణాలను తగ్గించాలని...
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 15 వేల ప్రమాదాలు సంభవించగా అందులో 5,157 మంది మృత్యువాత పడ్డారు. 11,380 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సత్వర చికిత్స చేయించి మరణాలను తగ్గించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు.
గోల్డెన్ అవర్...
ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట ఎంతో విలువైంది. దీన్నే ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ప్రమాద బాధితులకు ఈ సమయంలో మెరుగైన చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకునే పోలీసులు అంబులెన్సుని పిలిపించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తుంటారు.
చాలా సందర్భాల్లో క్షతగాత్రులు ఆసుపత్రికి వెళ్లే సరికి అక్కడ అత్యవసర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు, సామగ్రి ఉండదు. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులూ అందుబాటులో ఉండరు. ఇలా.. ప్రమాద సమాచారం తెలుసుకోవడం, అంబులెన్సును పిలిపించడం, ఆసుపత్రికి తరలించడం, అక్కడ సరైన ఏర్పాట్లు, వైద్యులు ఉండకపోవడం లాంటి కారణాలతో ఆలస్యం జరిగి మొదటి గంట(గోల్డెన్ అవర్) వృథా అవుతుంది.