రాష్ట్రంలో పంట బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో ప్రగతి భవన్ ఎదుట ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. భాజపా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో రైతులు.. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ప్రధానమంత్రి పంట బీమా పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా కాలయాపన చేస్తోందని రైతులు ఆరోపించారు. దీనికి నిరసనగా గోడపత్రికలు, ఉరితాళ్లు పట్టుకుని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. లోపలకు వెళ్లేందుకు యత్నించిన భాజపా నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాన ద్వారం వద్ద రైతులు బైఠాయించి కదలబోమంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని అరెస్టు చేసి గోషామహల్ పీఎస్కు తరలించారు.
రుణ మాఫీ అమలు చేయాలి