స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్న బాలుడిని బెంచి రూపంలో మృత్యువు వెంటాడింది. ఆట మధ్యలో సేద తీరేందుకు సిమెంట్‌తో తయారు చేసిన బల్లపై కూర్చున్న బాలుడు... అదే తన పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయాడు. బెంచీపై కూర్చోని అటూ ఇటూ ఊగుతుండగా... ఒక్కసారిగా ఊడిపోయి బాలుడిపై పడింది. ఈ దుర్ఘటనలో తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. ఆ సమయంలో బాలుడి అన్న కూడా అక్కడే ఉన్నాడు. స్నేహితుల సాయంతో సిమెంట్ బెంచీని పైకి తీశారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
తల్లి, అపార్ట్మెంట్ వాసులు కలిసి బాలుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అపార్ట్మెంట్లో సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తండ్రి నిశాంత్ శర్మ, అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు ఉన్న చోట్ల అపార్ట్మెంట్ నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని, నాణ్యమైన సదుపాయలు సమకూర్చాలని అంటున్నారు.
అత్తాపూర్‌లో పదేళ్ల క్రితం జనప్రియ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి విక్రయించింది. నాలుగు బ్లాకుల్లో 950కి పైగా ఫ్లాట్లున్నాయి. నిర్మాణ సమయంలో ఉన్న పార్కులను క్రమంగా ఆక్రమించి మరిన్ని భవన నిర్మాణాలు చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. టెన్నిస్ గ్రౌండ్, పక్కనే ఉన్న గార్డెన్‌ను కూడా తీసేసి మరో అపార్ట్మెంట్ నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కొంతమంది అపార్ట్మెంట్ వాసులు ఈ బెంచీలను ఏర్పాటు చేశారు. మొదట్లో బాగానే ఉన్నా... నిర్వహణ లేక క్రమంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నిర్వహణ పేరుతో డబ్బులు తీసుకుంటున్నా... కమిటీ సభ్యులు కనీస సౌకర్యాల గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు.