Attack on constable : నగరంలో ఆకతాయిల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పగటివేళ కుక్కల దాడులు..రాత్రివేళ ఆకతాయిల దాడులు జరుగుతున్నాయి. ఆకతాయిలు మద్యం సేవించి.. పేట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేయడం, రాత్రి పూట రోడుపై వెళ్లేవారిపై దాడి చేయడం తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సై పరీక్ష రాయడానికి నగరానికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడి ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ పోలీసు స్టేషన్‌లో అనిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎస్సై పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌లోని శ్రీకృష్ణనగర్‌లో నివసించే తన సోదరుడి గదికి వెళ్లాడు. తనతో పాటు గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న మరో సోదరుడు శ్రీనివాస్ సైతం వచ్చాడు. శనివారం రెండు పరీక్షలు రాశారు. రాత్రి భోజనం చేయడానికి ముగ్గురు కలిసి నడిచి వెళ్తుండగా... ఓ కారు రాష్ డ్రైవింగ్ చేస్తూ వేగంగా వీరికి అతి దగ్గరగా వెళ్లడంతో.... చూసుకొని వెళ్లొచ్చు కదా..! అంటూ అనిల్ అరిచాడు. కారు ఆపిన ఇద్దరు యువకులు ఒక్కసారిగా వారి ముగ్గురిపై ముకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
దీంతో ఊరుకోక తమ స్నేహితులకు ఫోన్ చేసి మరికొందరిని రప్పించి గుంపుగా వీరిపై విరుచుకుపడ్డారు. ఘటనలో అనిల్‌కు తీవ్రంగా గాయలయ్యాయి. వెంటనే స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు సోదరులకూ స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ గౌడ్.. ఆదివారం రాయాల్సిన ఎస్సై పరీక్ష రెండు పేపర్లకు హాజరుకాలేకపోయాడు. ఈ ఘటనపై అనిల్ గౌడ్, అతని సోదరులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.