బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్‌నేరగాళ్లు కొత్త దారుల్ని వెతుకుతున్నారు. గతంలో కస్టమర్లకు ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని నమ్మబలుకుతూ వారి నుంచి ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ తదితర సమాచారాన్ని తెలుసుకొని ఖాతాల నుంచి నగదును దోచుకునేవారు. బ్యాంకులు ఇలాంటి సైబర్ నేరాల పట్ల ఖాతాదారులను అప్రమత్తం చేయడం, వినియోగదారుల్లోనూ అవగాహన కలిగించడం వల్ల మోసగాళ్లు కొత్త మార్గాల్లో దోపిడీలకు తెగబడుతున్నారు. ఇప్పుడు ఏటీఎంలలో స్కిమ్మింగ్ పరికరాలు పెడుతూ దోచుకుంటున్నారు.
ఏమిటీ స్కిమ్మింగ్?
ఏటీఎం మిషన్లలో ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని సేకరించడమే ‘స్కిమ్మింగ్’. కార్డుల సమాచారాన్ని చౌర్యం చేయడానికి ఉపయోగించే వాటిని స్కిమ్మర్ పరికరాలంటారు. ఎంపిక చేసుకున్న ఏటీఎంలలో మోసగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమరుస్తారు.
కస్టమర్లు ఏటీఎం ద్వారా నగదు తీసుకునేందుకు కార్డును స్వైప్ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్ నంబర్ స్కిమ్మర్ గ్రహిస్తుంది. సేకరించిన సమాచారంతో మోసగాళ్లు ఆ తర్వాత నగదును కొల్లగొడుతారు. దీని కోసం కూడా పలు దారులు ఎంచుకుంటున్నారు. ప్రధానంగా నకిలీ కార్డులను తయారుచేసి సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదు తస్కరిస్తున్నారు.
ఇప్పుడు మనమేం చేయాలి...?
ఏటీఎంలో కార్డు రీడర్‌పై సైబర్ నేరగాళ్లు స్కిమ్మర్లను అమరుస్తారు. దానితో పాటు ఏటీఎం పిన్ తెలుసుకోడానికి కీప్యాడ్‌కు వ్యతిరేకంగా పైభాగంలో చిన్న కెమేరాతో కూడిన స్కానర్‌ను కూడా ఉంచుతారు.
- మనం ఏటీఎంలకు వెళ్లినప్పుడు ఇలాంటి పరికరాలు ఏవైనా ఉన్నాయో పరిశీలించడం ఉత్తమం.
- నగర శివార్లలో ఉండే, జనసంచారం ఎక్కువగా లేని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలకు వెళ్లకపోవడమే మంచిది.
- పిన్ టైప్ చేసేటప్పుడు అరచెయ్యిని అడ్డుపెట్టుకోవడం సురక్షితం.
- నగదు విత్‌డ్రా చేయగానే మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చేలా ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్‌లు పెట్టుకోవాలి.
- చాలా మంది కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చేసినా.. ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు.
- ఫోన్ నంబరు మార్చితే తక్షణమే బ్యాంకు ఖాతాకు కొత్త నెంబరును అనుసంధానం చేసుకోవడం మరచిపోవద్దు.
- ఖాతా నుంచి మన ప్రమేయం లేకుండానే నగదు ఉపసంహరణ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి మన ఏటీఎంను బ్లాక్ చేయించాలి.
- వెంటనే సంబంధిత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఏటీఎంకెళ్తున్నారా... స్కిమ్మింగ్లతో జాగ్రత్త
ఇదీ చూడండి:'సార్వత్రికం' రెండో దశ: లైవ్ అప్డేట్స్