దేశ వ్యాప్తంగా రెండు లక్షల 10వేల 195 ఏటీఎంలు ఉన్నాయి. అందులో బ్యాంకుల ఆవరణలో ఉన్నవి లక్షా 13వేలుకాగా బ్యాంకుల బయట వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలు 97వేలకుపైగా ఉన్నాయి. బ్యాంకులకు వీటి నిర్వహణ రోజు రోజుకు భారంగా మారుతోంది. దీంతో బ్యాంకుల ఆవరణలో ఉన్న ఏటీఎంల నిర్వహణ ఒక మాదిరిగా ఉన్నప్పటికీ బ్యాంకుల బయట వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల నిర్వహణ గాలిలో కలిసిపోయింది.
అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉండడం లేదు. ఏసీలు పాడై పోయాయి. నిర్వహణ మరింత అద్వానంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఖాతాదారులపై లావాదేవీల ఛార్జీలు వేయడం ద్వారా ఏటీఎంల నిర్వహణా భారాన్ని తగ్గించుకునే దిశలో బ్యాంకులు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
ఏటీఎంల నిర్వహణ, ట్రాన్జాక్షన్ ఛార్జీలు తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2019 జూన్ ఆరున ద్రవ్య విధాన కమిటీలో భాగంగా ప్రకటించింది. అప్పటి భారతీయ బ్యాంకుల సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.జి.కన్నన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ 2019 అక్టోబర్ 22న సెంట్రల్ బ్యాంకుకు సిఫారసుల నివేదికను అందజేసింది. అయితే ఇప్పుటి వరకు అది బయటకు రాలేదు.
శ్రీకాంత్ అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద ధరఖాస్తు చేయగా మొదట నిరాకరించినప్పటికీ ఆ తరువాత అప్పీల్‌కు వెళ్లిన తరువాత పూర్తి వివరాలు వచ్చాయి. ఆ నివేదిక ప్రకారం ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరిగింది. అయితే సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఏటీఎంల ఏర్పాటు లేకపోవడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ఏటీఎంల వాడకం గణనీయంగా పెరుగుతోంది. అయినప్పటికీ, గత మూడు సంవత్సరాల నుంచి ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరుగుతుండడం వల్ల కొత్త ఏటీఎంల విస్తరణలు లేకుండా బ్యాంకులు స్తబ్దుగా ఉన్నాయి. మరో వైపు ఏటీఎం వినియోగ ఛార్జీలు, ఇంటర్ చేంజ్ ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవని కమిటీ గుర్తించింది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల నుంచి అధిక నగదు ఉపసంహరణను నిరుత్సాహపరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సిఫారసులు చేసింది. అయితే ఐదువేలకు మించి నగదు ఉపసంహరణ లావాదేవీలకు ప్రతి వ్యక్తిగత లావాదేవీకి బ్యాంకులు కస్టమర్ ఛార్జీలు వసూలు చేయవచ్చని కమిటీ నివేదికలో పేర్కొంది. ఏటీఎం ఛార్జీలను లెక్కించడానికి జనాభాను ప్రామాణికంగా ఉపయోగించాలని నివేదిక సిఫార్సు చేసింది.
2011 జనాభా లెక్కల ఆధారంగా పది లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని కేంద్రాల్లోని ఏటీఎంలలో ఉచిత లావాదేవీలను నెలకు ఇప్పుడున్న 5 నుంచి 6కు పెంచాలని సూచించింది. అధిక జనాభా కలిగిన ఏటీఎంల కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న ఐదు ఉచిత లావాదేవీల నుంచి మూడింటికి పరిమితం చేయాలని సిఫార్సు చేసింది.
ఇవీచూడండి:ఔషధ మొక్కలపై పరిశోధనకు ఇదే సరైన సమయం: గవర్నర్