Atluri Rammohan Rao : రామోజీ గ్రూపు సంస్థలకు సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్‌రావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. అట్లూరి రామ్మోహన్‌రావు 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఆయన సహాధ్యాయి, బాల్య స్నేహితులు. ఉపాధ్యాయుడిగా రామ్మోహన్‌రావు తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1974లో ఈనాడులో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది.. 1995వరకు ఆ పదవిలో కొనసాగారు. 1992 నుంచి ఫిల్మ్ సిటీ నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. రామోజీ గ్రూప్, ఈనాడు సంస్థల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రామ్మోహన్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు
చంద్రబాబు సంతాపం: ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేక ఒరవడిని తీర్చిదిద్ది, రామోజీ గ్రూప్ లోని పలు సంస్ధలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించిన రామ్మోహన్‌రావు గారి మరణం విచారకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను