ERC CHAIRMAN: వ్యవసాయ బోరు బావుల వద్ద మీటర్లు బిగించమని ఈఆర్సీ ఎప్పుడూ చెప్పలేదని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మోటార్ల వద్ద మీటర్లు పెట్టాలని ఈఆర్సీ చెప్పిందని చెప్పడం అబద్దమని తెలిపారు. కేవలం ట్రాన్స్ఫార్మర్స్ (డీటీఆర్)ల వద్దనే మీటర్లు బిగించమని చెప్పామని ఆయన తెలిపారు. వాటిలోను స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పడం జరిగిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల డీటీఆర్లు ఉన్నాయని అక్కడ మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించాం. మార్చి 23 ఈఆర్సీ టారీఫ్ ఆర్డర్ ఇచ్చామని పేర్కొన్నారు. టారీఫ్ ఆర్డర్స్ ఇచ్చే సమయంలో డిస్కంలకు మార్గదర్శకాలు జారీ చేశాం. ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మహారాష్ట్రలో 36వేల కోట్లు విద్యుత్ దుర్వినియోగం జరిగిందని త్రిసభ్య కమిటీ తేల్చింది. అటువంటి సంఘటన రాష్ట్రంలో జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియచేశారు. వినియోగదారుల హక్కులు, వారి బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు కామారెడ్డి ,మెదక్ జిల్లాలో పర్యటించనునట్లు శ్రీరంగారావు పేర్కొన్నారు.