దేశానికి వెన్నెముకగా పేర్కొనే రైతు.... సేద్యం భారంగా భావించి బలవన్మరణానికి పాల్పడుతున్న స్థితి నుంచి... అధిక లాభాలు గడించే స్థాయికి ఎదిగాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏకలవ్య ఫౌండేషన్ ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయ విధానంపై అవగాహన కల్పిస్తోంది. తొలుత 500 ఎకరాల్లో సాగును ప్రారంభించారు. ఇప్పుడు 3 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు సుమారు 1500 మంది రైతులు ముందుకొచ్చారు.
రైతు కుటుంబాల సమ్మేళనం..
ఈ క్రమంలోనే రైతుల విజయగాథలు బాహ్యప్రపంచానికి తెలిసేలా.. రైతు కుటుంబాల సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వస్తుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. గుడిహత్నూర్ మండలం లింగాపూర్‌లో 26 ఎకరాల వనరుల కేంద్రంలో.. సమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటేటా సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం పెరగడంతో.. రైతుల సమ్మేళనం ఏర్పాటు చేసినట్లుగా ఏకలవ్య ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు.