బడ్జెట్ పద్దులపై నేడు చర్చ పూర్తి కానుంది. నాలుగు రోజులపాటు చర్చించాల్సిన 25 పద్దులపై ఇవాళ చర్చ చేపట్టనున్నారు. ఇప్పటివరకు కొన్ని పద్దులపై చర్చ పూర్తి కాగా.. మరో నాలుగు రోజుల పాటు పద్దులపై చర్చ జరగాల్సి ఉంది. కానీ.. కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్య, వైద్యం, పర్యాటకం, క్రీడలు, కార్మిక, అటవీ, దేవాదాయ, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇంధన శాఖల పద్దులపై చర్చ చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బిల్లులను కూడా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టనుంది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లు, కార్పొరేషన్ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి మినహాయింపు, జీఎస్టీ సవరణ బిల్లులపై సభలో చర్చిస్తారు.
స్వయం సహాయక మహిళా సంఘాలకు కో- కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకమైన అభయ హస్తాన్ని తొలగిస్తూ.. మరో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఇస్తున్న నేపథ్యంలో అభయహస్తం పింఛన్ల పథకాన్ని రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకనుగుణంగా ఇవాళ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.