రాష్ట్రంలో పెద్దలసభ ఎన్నికల(mlc elections telangana 2021) హడావిడి ప్రారంభమైంది. శాసనసభ కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఆరు స్థానాలకు ఎన్నిక కోసం ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అవసరమైతే పోలింగ్ 29న నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుత శాసనసభ బలాబలాల ప్రకారం చూస్తే పోలింగ్ అవసరం రాకపోవచ్చు. ఆరు స్థానాలను కూడా అధికార తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అదే జరిగితే ఉపసంహరణల గడువు పూర్తైన వెంటనే ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. అటు స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన 12 స్థానాలు కూడా త్వరలో ఖాళీ కానున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది.
తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి...
హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి వీరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి రెండు చొప్పున స్థానాలున్నాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ఈ స్థానాల నుంచి జనవరి నాలుగో తేదీలోగా కొత్త వారిని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల(mlc elections telangana 2021) నిర్వహణ కోసం కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థలు, ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు, ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయా?... ఉంటే ఏ మేరకు ఉన్నాయి? తదితర వివరాలను ఈసీ పరిశీలిస్తోంది. ఈ మేరకు సంబంధిత సమాచారం పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌ను ఆదేశించింది. నేడో, రేపో ఈ సమాచారం, వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి చేరనున్నాయి.