ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను అగౌరవపరిచేలా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు... సెప్టెంబరు 14న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసునిచ్చేందుకు నిర్ణయించింది. మంగళవారంనాడే అచ్చెన్నాయుడు కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నానని, సమయమిస్తే వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇస్తానని ఆయన రాతపూర్వకంగా కోరినట్లు తెలిసింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబరు 14న హాజరవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. సంఘం ఛైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది.
స్పీకర్‌పై వ్యక్తిగత దూషణలు చేశారనే అభియోగంపై తెదేపా మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా మంగళవారం కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది. ఆయన రాలేదు. తాను వ్యక్తిగత విమర్శలు చేశాను తప్పా.. సభాపతి స్థానాన్ని అగౌరవపరచలేదని కూన రవికుమార్ కమిటీకి వివరణ పంపినట్లు తెలిసింది. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడమంటే ఆ స్థానాన్ని కించపరిచినట్లేనన్న భావనను కమిటీ వ్యక్తం చేసినట్లు తెలిసింది. వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసునిచ్చినా స్పందించనందున ధిక్కారం (కంటెంప్ట్)గా భావించి ఆయనపై చర్య తీసుకునేలా శాసనసభకు సిఫార్సు చేయాలని కమిటీ నిర్ణయించింది.