హైదరాబాద్ మెహదీపట్నం రేతిబౌలి వద్ద ఎండకు ఆయాసపడుతునే.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది ఓ వృద్ధురాలు. నడిచేందుకు ఓపికలేకపోయినా ఆమె ముందుకు వెళ్తునే ఉంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆసిఫ్ నగర్ సీఐ నాగం రవీందర్ ఈ విషయాన్ని గమనించారు. ఆ వృద్ధురాలిని ఆపి ఆమెతో కాసేపు మాట్లాడారు. తన పేరు లక్ష్మి అని.. కరీంనగర్ జిల్లా మానకోడూరు తమ సొంత ఊరని తెలిపింది. కొడుకు అజయ్ క్యాన్సరతో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం నాంపల్లిలోని క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పింది.
వెయ్యి రూపాయల కోసమే..
వైద్యం కోసం తను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయని.. చేతిలో చిల్లిగవ్వ లేక బంధువుల సాయం కోరినట్లు సీఐతో వివరించింది. రాజేంద్రనగర్, ఆరెమైసమ్మ ప్రాంతంలో నివాసముండే తన బంధువులు 1000 రూపాయలు ఇస్తామన్నారని అందుకే వాళ్లని కలిసేందుకు వెళ్తున్నట్లు తెలిపింది. మెహదీపట్నం చేరుకోగానే లాక్డౌన్ సడలింపు సమయం పూర్తయినందున ఒంట్లో శక్తి లేకపోయినా కొడుకు వైద్యం కోసం నడక ప్రారంభించానని చెప్పింది. ఆమె బాధని విని కరిగిపోయిన సీఐ రవీందర్ వెంటనే ఆమెకు తాగునీరు, గ్లూకోజ్ అందించారు.