ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో వంశాచారానికి అనుగుణంగా మాన్సాస్(Mansas Trust) ట్రస్ట్ ఛైర్మన్గా అశోక్ గజపతిరాజు(Ashok gajapathi raju) తిరిగి బాధ్యతలు స్వీకరించారు. విజయనగరంలోని మాన్సాస్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి మాన్సాస్ ఈవో వెంకటేశ్వర రావు, కరెస్పాండెంట్ కేవీఎల్ రాజు గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రస్ట్ నిర్వహణలో అధికారులు సహకరించాలని కోరారు.మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలన్న ఆయన.. మాన్సాస్ సిబ్బందికి జీతాలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై త్వరలోనే దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.
సింహాచలం ఆలయ ఈవో కూడా నిన్న నన్ను కలవడానికి ఇష్టపడలేదని అశోక్ గజపతిరాజు(Ashok gajapathi raju) అన్నారు. నెల్లిమర్ల మండలంలోని రామతీర్ధంలో దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని వైకాపా ప్రభుత్వం పట్టుకోక పోగా.. ఆలయ అభివృద్ధికి పంపిన చెక్కును వెనక్కి పంపడం తనను మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి కూడా ఆహ్వానించలేదని వెల్లడించారు.