sha Workers Protest In Telangana : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆశా కార్యకర్తలు అంబేడ్కర్ (Asha Worker) విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి తమ నిరసన తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ... రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా సరే... అధికారులెవరు తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము చేయాల్సిన పనులతో పాటు... ఇతరత్రా వెట్టిచాకిరి పనులు చేయించుకుంటూ చాలీచాలని వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ ఆశా వర్కర్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు.
గుజరాత్ కంటే తెలంగాణలోనే ఆశా వర్కర్లకు అధిక వేతనాలు: కేటీఆర్
"తెలంగాణ బిడ్డలు ఎందుకు రోడ్డు పైకి వచ్చి ధర్నా చేస్తున్నారని పట్టించుకున్న నాథులే లేరు. మా పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. పారితోషికంలా కాకుండా మాకంటూ జీతాన్ని ఫిక్స్ చేయాలి. చేయిస్తున్న సర్వేలను తగ్గించాలి. జాబ్ క్లారిటీ ఇవ్వాలి, హెల్త్ కార్డు, ఆరోగ్య భద్రత కల్పించాలి." - ఆశా వర్కర్ , సిద్దిపేట
Asha Workers Demands to Telangana Government : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సంగారెడ్డి (Asha workes Demands) జిల్లా జహీరాబాద్‌లో ఆశా కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. గ్రామస్థాయిలో ఆరోగ్య సేవ కార్యక్రమాల్లో పనిచేస్తున్నా.. ప్రభుత్వం ప్రోత్సాహకాలతోనే.. సరిపెడుతోందని ఆరోపిస్తూ.... స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో శాసనసభ్యులు పొదెం వీరయ్య క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు.. ఆపై అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు సీఐటీయూ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అనుమతితో మంత్రిని కలిసేందుకు కొందరని మాత్రమే అనుమతించారు.