రాష్ట్రంలో ఆసరా పింఛన్లు ఇప్పటి మాదిరిగానే తపాలా సిబ్బంది, బ్యాంకుల ద్వారా పంపిణీ కానున్నాయి. గ్రామాలకు దూరంగా ఉండే బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తీసుకోవడం లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు సులువుకాదనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నగరాలు, పట్టణాలు, కొద్దిపాటి గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు మాత్రమే ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పింఛను అందుకుంటున్నారు. మిగతా గ్రామీణ ప్రాంతాల వారందరికీ.. తపాలా సిబ్బందే గ్రామాలకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. బయోమెట్రిక్ పరికరాలను గ్రామాలకు తీసుకెళ్లి.. లబ్ధిదారుల వేలిముద్రలను నమోదు చేసి నగదు ఇస్తున్నారు. ఈ సేవలకుగానూ తపాలాశాఖకు ప్రభుత్వం కొంత కమీషన్ చెల్లిస్తోంది.
ప్రస్తుత విధానంలో సమస్యలు
తపాలా సిబ్బంది ప్రతి నెలా గ్రామాలకు వెళ్లి పింఛన్లు అందజేయాలంటే ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు ఆర్‌బీఐతో మాట్లాడి నగదును సిద్ధం చేయాల్సి ఉంటుంది. నగదు సమస్యతో ఒక్కోసారి పింఛన్ల చెల్లింపుల్లో జాప్యం అనివార్యమవుతోంది. బయోమెట్రిక్ పరికరాలకు గ్రామాల్లో సిగ్నల్ అందకపోవడం, రేఖలు అరిగిపోయి వృద్ధుల వేలిముద్రలను బయోమెట్రిక్ పరికరాలు స్వీకరించకపోవటం వంటి సమస్యలూ ఉన్నాయి.