తెలంగాణ

telangana

ETV Bharat / state

పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...? - ASARA PENSION SCAM IN HYDERABAD

లక్షల్లో లబ్దిదారులు... కోట్లాది రూపాయల పింఛన్లు... అంతా పకడ్బందీగా జరిగేందుకు యంత్రాంగం. అయినా అక్రమార్కులు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఏడెనిమిది నెలలుగా అర్హులకు అందాల్సిన సొమ్ములు మింగేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కడుపునింపే కొద్దిపాటి సొమ్మును స్వాహా చేస్తున్నారు.

ASARA PENSION SCAM IN HYDERABAD

By

Published : Aug 25, 2019, 6:43 AM IST

పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో ఆసరా పింఛన్లు పక్కదారి పడుతున్నాయి. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాల్సిన సొమ్ములు బయటివ్యక్తుల చేతుల్లోకి చేరుతున్నాయి. కొద్ది నెలలుగా గుట్టుగా సాగుతున్న వ్యవహారం ప్రస్తుతం వెలుగులోకొచ్చింది. వృద్ధులకు అందించే పింఛన్లు ఇంత యథేచ్ఛగా పక్కదారి పట్టడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలకు అసలు పాత్రదారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆరుగురు వృద్ధుల ఫిర్యాదుతో వెలుగులోకి...

పింఛను డబ్బులు ప్రతినెలా 1, 2 తేదీల్లో లబ్దిదారుల ఖాతాల్లోకి చేరాలి. కొద్దినెలలుగా కొందరు అర్హులకు పింఛను డబ్బులు జమకావట్లేదు. కొద్దిరోజుల క్రితం ఆరుగురు వృద్ధులు ఆగస్టు నెల పింఛను డబ్బు రాలేదని హైదరాబాద్​ చార్మినార్ తహసీల్దార్​కు ఫిర్యాదు చేయగా... ఆయన కలెక్టర్​కు సమాచారమిచ్చారు. కలెక్టర్ మాణిక్​రాజ్ కన్నన్ ఆదేశాలతో రికార్డులను పరిశీలించిన అధికారులు ఇతరుల సొమ్ము బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్టు గుర్తించారు. జిల్లాలోని 16 మండలాల్లోనూ ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా నిర్ధరించారు. చార్మినార్​లో సుమారు 260 మంది ఆసరా పింఛన్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్టు తేల్చారు. తహసీల్దార్ కార్యాలయం లాగిన్​ను ఉపయోగించుకుని అక్రమార్కులు లక్షలాది రూపాయలు స్వాహా చేశారు.

ఆషామాషీ కాదు... అయినా...

ఆసరా పింఛన్ల దరఖాస్తు, అర్హుల ఎంపిక ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయాల నుంచి జరుగుతాయి. లబ్దిదారులకు పింఛన్ల మంజూరు కలెక్టరేట్ నుంచి కొనసాగుతుంది. అర్హులకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ... నిధులు విడుదల చేస్తుంది. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రెవెన్యూ యంత్రాంగం చేరవేస్తుంది. ఇంత పకడ్బందీగా జరిగే ప్రక్రియలో ఏకంగా బ్యాంకు ఖాతాలను మార్చేయటం, దర్జాగా సొమ్ములు మళ్లించుకోవటం అంత ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు అధికారులు. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పరిపాలన నిర్వహణలో భాగంగా అధికారులు ఐడీ, పాస్​వర్డ్ చెబుతుంటారు. సిబ్బందే అక్రమాలకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ముషీరాబాద్​లో ఓ వికలాంగుడి పింఛన్​ విషయంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

అంతా తెలిసివాళ్లే అసలు దొంగలా...?

ఈ ఏడాది జనవరిలో 80-90 శాతం మంది లబ్దిదారులు తమ బ్యాంకు ఖాతాలను కుటుంబ సభ్యుల పేరిట మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమార్కులు చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ రికార్డుల్లోనూ లబ్దిదారుల సంఖ్య, పేర్లు యథావిధిగా ఉండటం వల్ల ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఇదంతా పింఛన్ల లావాదేవీలు పూర్తిగా తెలిసిన వ్యక్తుల ప్రమేయంతోనే జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘరానా మోసానికి సూత్రదారులు, పాత్రదారులను గుర్తించేందుకు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి...ఆయనతో సహజీవనం చేయట్లేదు: భూమి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details