Asaduddin Owaisi Interesting Comments: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తాజ్మహల్ మాదిరిగా సచివాలయాన్ని చాలా బాగా నిర్మించారని కొనియాడారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన మీడియా ఇష్టాగోష్ఠిలో అసదుద్దీన్ పలు అంశాలపై మాట్లాడారు.
కొత్త సచివాలయంలో మసీదును నిర్మించాలని ప్రభుత్వాన్ని అడిగామని.. ఇందులో భాగంగానే మసీదు కడుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని.. దేశమంతా వస్తే మంచిదేనని వివరించారు. ఎంఐఎంను బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని అసదుద్దీన్ దుయ్యబట్టారు.