హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై అసదుద్దీన్ మరోసారి జెండా ఎగురవేశారు. వరుసగా నాలుగోసారి విజయ సాధించారు. భాజపా అభ్యర్థి భగవంత్ రావుపై 2,78,281 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు పారంభమైన తర్వాత ఎంఐఎం, భాజపా మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరికి ఓవైసీ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఇక్కడి నుంచి ఓవైసీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్, భాజపా తరఫున భగవంత్ రావు తెరాస నుంచి పుస్తె శ్రీకాంత్ పోటీ చేశారు. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ... ఎంఐఎం, తెరాస మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నందున ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, కమలం పార్టీ మధ్యే ఉంది.
హైదరాబాద్ లోక్సభలో 1985 నుంచి ఓవైసీ కుటుంబానిదే ఆధిపత్యం. వరుసగా 5 పర్యాయాలు ఎంఐఎం తరఫున సలావుద్దీన్ గెలిచారు. తరువాత ఆయన తనయుడు అసదుద్దీన్ రాజకీయ వారసుడిగా 2004లో పాతబస్తీ బరిలో దిగి... హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇప్పుడు నాలుగోసారి విజయ బావుటా ఎగురవేశారు. నియోజకవర్గ పరిధిలో ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండటం, పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలవడం ఓవైసీకి సానుకూలాంశాలు.