దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై యూజీసీ ఇటీవల నిపుణుల కమిటీని నియమించింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలను నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్ భావిస్తోంది. గవర్నర్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ బోధనకు పాటించాల్సిన నిబంధనలపై విశ్వవిద్యాలయం ఈనెల 10న కళాశాలలకు ఆదేశాలిచ్చింది.
సిలబస్ పూర్తి కావడానికి మరో వారం పట్టొచ్చు..
ఏప్రిల్ నెలాఖరు కల్లా సిలబస్ పూర్తిచేయాలని కళాశాలలను తాజాగా ఆదేశించినా..మరో వారం అదనంగా పట్టొచ్చని ఆచార్యులు భావిస్తున్నారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ తరగతులు జరగలేదు. ఆ రోజులను మినహాయిస్తే మే 10వ తేదీకి నిబంధనల ప్రకారం 16 వారాల బోధన పూర్తవుతుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
ఉన్నత విద్యామండలి సూచనల మేరకు
యూజీసీ కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనల మేరకు పరీక్షలపై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తొలుత బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే చాలని, మిగిలిన విద్యార్థుల పరీక్షలపై తొందరేమీ లేదని వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితులను చూస్తుంటే మాత్రం పరీక్షలు ఈ సారి ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తున్నారు. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 50 వేల మంది వరకు ఉంటారు.