Take necessary action against Dogs Attack: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగర పరిసర మున్సిపాలిటీల పరిధుల్లో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్దప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు, వెటర్నరీ విభాగం అధికారులు పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో 8.50 లక్షల వీధి కుక్కలు ఉండేవి. వాటికి స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వీటి సంఖ్య అయిదున్నర లక్షలు. బాగ్ అంబర్ పేట్ ఘటన జరిగిన నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఉన్న వీధి కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆయా కాలనీలల్లో కొన్ని వాటర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అంతే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, చికెన్, మటన్ సెంటర్లు వ్యర్థ పదార్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలన్నారు. నగరంలో వీధి కుక్కలు, వాటి మూలంగా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున వాటిని నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాల పిల్లలు, విద్యార్థులకు.. పెంపుడు, వీధి కుక్కల గురించి అవగాహన లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని.. దీన్ని అరికట్టడానికి వారికి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వీటిని నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, హోర్డింగ్స్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
నగర, మున్సిపాలిటీల పరిధుల్లో ఉన్న స్లమ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్స్, టౌన్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్స్, రెసిడెంట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర మున్సిపాలిటీలల్లో మోప్మా, స్వయం సహాయక బృందాలతో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. పెంపుడు జంతువుల నమోదు గురించి ఒక ప్రత్యేక మొబైల్ యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను మై జీహెచ్ఎంసీ యాప్, నంబర్ 040 - 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుక్కల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్ యాప్ను సైతం రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ యాప్‌లో సంబంధిత యజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా ఒక గుర్తింపు కార్డును కూడా మంజూరు చేయనున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించవచ్చని అన్నారు. ఆ ప్రాంతాలకు వెటర్నరీ బృందాలను తరలించి తగిన చర్యలు చేపట్ట వచ్చని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: