హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై దాడి ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై అర్వింద్ తల్లి డి. విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరపున పర్సనల్ అడ్వకేట్లు, మేనేజర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఉదయం 11.30 గంటలకు 50 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాన గేటు పగులగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్‌ఎస్ జెండాలు, కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు.
ఈ దాడిలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారన్నారు. బెంజ్‌కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. దాడికి పాల్పడిన 50 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.