Delhi Liquor Scam Latest Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన అరుణ్ పిళ్లైను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేటితో పిళ్లై కస్టడీ ముగియడంతో ఇవాళ ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే మరో మూడు రోజుల పాటు అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మార్చి 16 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి కేసు విచారణ మార్చి 16కు వాయిదా వేసింది.
మనీలాండరింగ్‌కు సంబంధించిన సౌత్ గ్రూప్‌లోని వ్యక్తులను కూడా ప్రశ్నించాల్సి ఉందన్న ఈడీ.. ఈ క్రమంలో పిళ్లై కస్టడీ పొడిగించాలని పేర్కొంది. లిక్కర్ పాలసీ హోటల్ సమావేశాలు, డ్రాఫ్ట్ పాలసీ పిళ్లై ఫోన్లోకి ఎలా వచ్చిందనే అంశాలపై ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు వివరించింది. అదే విధంగా మార్చి 9న బుచ్చిబాబును ఈడీ విచారణకి రావాలని కోరగా... మార్చి 13 వరకు సమయం కోరారని తెలిపింది. దాంతో ఈ నెల 15న బుచ్చిబాబును ప్రశ్నించబోతున్నట్లు ఈడీ వెల్లడించింది. బుచ్చిబాబుతో కలిపి అరుణ్ రామచంద్ర పిళ్లైను విచారించాల్సి ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. బుచ్చిబాబుతో కలిపి అరుణ్ పిళ్లైను వాట్సప్ చాట్స్ గురించి ప్రశ్నించాల్సి ఉందని తెలిపింది.
ఇప్పటికే ఈడీ 29 సార్లు అరుణ్ పిళ్లైను విచారణకి పిలిచి 11 సార్లు స్టేట్మెంట్ రికార్డు చేసిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిళ్లై ఈ కేసు విచారణకి సహకరించారన్న న్యాయవాది.. ఇతర నిందితులతో కలిపి ప్రశ్నిస్తే విచారణలో న్యాయవాది కూడా ఉండాలని కోర్టుకు వివరించారు. గత వారం కస్టడీతో కలిపి 36 సార్లు రామచంద్ర పిళ్లై కేసు విచారణకి హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. హోటల్ రికార్డులు చూపించి లిక్కర్ కేసు అరుణ్ పిళ్లైకి ఆపాదించాలని చూస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు.