Artist Laxman Aelay Daughter Priyanka Aelay Interview :కుంచెతో అద్భుతాలు సృష్టిస్తూ కన్నుల్లోనే కళలను నింపుకుని, కాన్వాస్‌పై కలలకు రూపం ఇస్తున్న ఈ యువతి బాల్యం రంగుల మయం. తండ్రి చాటు చిన్నారిగా ఆయన వేసిన బొమ్మల్లోతన రూపాన్ని చూసుకుంది. ఇప్పుడు మనసులో మెదిలే తన ఆలోచనలను కాన్వాస్‌పై అద్భుత చిత్రాలుగా ఆవిష్కృతం చేస్తుంది. ఔరా అనిపించే ప్రతిభతో ప్రముఖలచేత ప్రశంసలు, మన్ననలు అందుకుంటుంది ఈ యువ చిత్రకారిణి.
ఈ యువతి పేరు ప్రియాంక ఏలె. యాదాద్రి జిల్లా కదిరేనిగూడెం స్వస్థలం. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే(Laxman Aelay) కుమార్తె ఈ ప్రియాంక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను తయారు చేసి, అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు లక్ష్మణ్ ఏలే. అయితే వాస్తవానికి ఆయనో గొప్ప చిత్రకారుడు. అక్కతో కలిసి చిన్నప్పటి నుంచి తండ్రి వేస్తున్న రంగుల చిత్తరువులను చూస్తూ పెరిగింది ప్రియాంక.
Priyanka Aelay about Paintings : తెలంగాణ ప్రజల సంస్కృతిని, వారి జీవనాన్ని ప్రతిభింబించేలా తండ్రి వేసిన పెయింటింగ్లను చూసి స్ఫూర్తి పొందింది ప్రియాంక. తొలినాళ్లలో ఆయిల్, పేస్టల్స్, పెన్ అండ్ ఇంక్‌తో ప్రయోగాలు చేసి, ఇప్పుడు యాక్రిలిక్స్‌తో అద్భుతాలు సృష్టిస్తుంది. తన పెయిటింగ్స్‌లో పర్యావరణం, జంతువులు, మొక్కలనే ఎక్కువగా చూపించే ప్రియాంక, ఇందుకు పురాణాలు, ఇతి హాసాల నుంచి స్ఫూర్తి పొందుతానని చెబుతోంది.
పల్లె సంస్కృతినీ, ప్రకృతి అందాలనూ చూపించేందుకు ఎలాంటి నిబంధనలు ఉండకూడదని తండ్రి చెప్పిన మాటలే ఆదర్శంగా తీసుకుంది ప్రియాంక. అయితే మనసులోని భావాలకు కుంచెతో దృశ్యరూపం ఇవ్వడం అంత సులభమేమీ కాదు. వాస్తవికత, భావుకతల మధ్య ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది. దీన్ని దృశ్యరూపంగా మలచడం ఎంతో క్లిష్టమైన పని. సవాల్‌గా తీసుకుని దాని అందిపుచ్చుకోవాలనుకుంది ఈ కళాకారిణి.