ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందంటారు. అవునూ ఆమె లేకపోతే మగాడే లేడు. అంతెందుకు ఈ సృష్టే లేదు. ఆమె పోషించని పాత్రేదైనా... ఉందా? అంటే చెప్పడం కష్టమే. ప్రతి ఇంట్లో ఆమె లేనిదే పూట గడవదు. ఏ పని సాగదు. ప్రతి పనిలోనూ ఆమె ఉండాల్సిందే. ఆమె లేని ఇల్లు... ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంటుంది. పిల్లలను బడికి తయారు చేసే దగ్గర నుంచి... అలసిపోకుండా... ఆయాస పడకుండా... విసుగు చెందకుండా తాను ఉన్నన్నాళ్లు సేవ చేస్తూనే... ఉంటుంది. ఏ ప్రతిఫలం ఆశించని అమ్మగా, ఇల్లాలిగా... పాత్ర ఏదైతేనేం సమర్థంగా పోషిస్తూ... ఎవరూ భర్తీ చేయలేని విధంగా ముందుకు సాగే స్త్రీమూర్తి సేవలను ఏమని కీర్తించగలం.
చిన్నపిల్ల నుంచే ఆమెకు అన్ని పనులు అలవడుతాయి. అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ... నాన్నకు సాయంగా.. ఇంట్లో సందడి చేస్తుంది. పెరిగి పెద్దైన తర్వాత ఓ ఇంటికి ఇల్లాలిగా వెళ్తుంది. అక్కడ అంతా కొత్త ప్రపంచం... అందరిలో కలిసిపోయి... ఆ ఇంటికి వెలుగులా మారిపోతుంది. భర్తే ప్రపంచంగా బతుకుతుంది. ఎంతలా అంటే ఆమె లేకుంటే భర్తకు ఏం పనిచేయాలో తోచనంత. భర్తకు అనుగుణంగా నడుచుకుంటూ... అత్తమామల బాగోగులు చూసుకుంటూ ఆమె పోషించే పాత్రకు వెలకట్టగలమా?
క్లిష్ట పరిస్థితులు ఎదురైతే... తాను సహనంగా ఉంటూ... ఎక్కడా కోపాన్ని ప్రదర్శించకుండా ఆమె పోషించే సంయమనం అనిర్వచనీయం. భర్తే సర్వస్వంగా బతికే ఆమెకు పిల్లలు మరో ప్రపంచం. వాళ్లే తన ధైర్యం. పిల్లల పెంపకం బాధ్యత మొత్తం తనదే. వాళ్లకు పాలు పట్టడం నుంచి వాళ్లు పెరిగి పెద్దయ్యే వరకు ఆమె చూపే ప్రేమకు ఏదైనా... కొలమానం ఉందా? భర్తలో సహభాగం అయిన ఆమె.. భర్తకు ఏ చిన్న హాని జరిగిన విలవిల్లాడిపోతుంది. ప్రతి పనిలోనూ ఆమె ఉండాల్సిందే.. లేకుంటే ఆ పని ముందుకు సాగదు.