ఏపీ నెల్లూరుకు చెందిన గంధవళ్ల ఉమాశంకర్... ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కళలపై ఆసక్తితో గాజు సీసాల్లో దేవాలయాలు, రథాలు, గుర్రాలు వంటి అనేక రకాల బొమ్మలను తయారుచేసి ఆశ్చర్యపరుస్తున్నారు. సుద్దముక్కలపై జాతీయ నాయకుల బొమ్మలు, పెన్సిల్ మొనలపై సూక్ష్మ చిత్రాలు, పెన్సిల్ గ్రాఫైట్‌తో ప్రఖ్యాత ఆలయాల నమూనాలు నిర్మిస్తూ అబ్బురపరుస్తున్నారు.
రావి ఆకులను ఎండపెట్టి.. వాటిని కత్తిరించి ప్రముఖుల చిత్రాలు తయారుచేస్తున్నారు. విద్యార్ధులకు అవగాహన, ఆసక్తి కలిగించేందుకు... బల్బులో ఆదర్శ పాఠశాల నమూనాను రూపొందించారు. వీటితో పాటు గాంధీజీ ప్రతిమ, రాట్నం, వందేమాతరం అనే హిందీ అక్షరాలను తీర్చిదిద్దారు.
పెన్సిల్ లెడ్తో అద్భుతాలు..
600 పెన్సిళ్ల గ్రాఫైట్‌తో ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ నమూనాను తయారు చేశారు. రోజుకు 10 గంటలు కష్టపడి... 60 రోజుల్లో 16సెంటీమీటర్ల వెడల్పు, 38సెంటీమీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఈ నమూనాతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించారు. పెన్సిల్ లెడ్తో జాతీయ పతాకం, తిరుమల శ్రీవారి ఆలయం, కేదార్నాథ్ మందిరం, క్రికెట్ ట్రోఫీలు, వినాయకుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, జీసస్ క్రైస్ట్, సచిన్ టెండూల్కర్ తదితరుల చిత్రాలను తయారు చేశారు.