తెలంగాణ

telangana

ETV Bharat / state

Delhi Liquor Scam: మొదలైన అరెస్టుల పర్వం... నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్​! - దిల్లీ మద్యం కుంభకోణం

దిల్లీ మద్యంముడుపుల కేసులో మొదలైన అరెస్టులు హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భాగ్యనగరానికి చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఆ కేసులో నిందితుడిగా ఉండటం.. ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంతో దర్యాప్తు సంస్థల వేడి ఏ క్షణమైనా నగరానికి తాకొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దిల్లీలో అరెస్టుచేసిన ఇద్దరికి రామచంద్ర పిళ్లైతో సంబంధం ఉందని ఎఫ్​ఐఆర్​లో సీబీఐ పేర్కొనడంతో తదుపరి చర్యలు హైదరాబాద్‌లో ఉండొచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది.

Delhi Liquor Scam
Delhi Liquor Scam

By

Published : Sep 29, 2022, 7:39 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను మరింత వేగవంతం చేశాయి. కేసు దర్యాప్తులో భాగంగా 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను సీబీఐ, ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టుచేశారు. మచ్‌లౌడర్‌ సంస్థ సీఈఓ, ఆప్‌కమ్యూనికేషన్స్‌ ఇంఛార్జి విజయ్‌నాయర్‌ను సీబీఐ అరెస్టు చేయగా.. ఇండోస్పిరిట్‌ ఎండీ సమీర్‌ మహేంద్రును ఈడీ అధికారులు.. దిల్లీలో అరెస్టు చేశారు. విజయ్‌నాయర్‌ తరఫున మహేంద్రు 2 నుంచి 4 కోట్లను దిల్లీఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అనుచరుడు అర్జున్‌పాండేకు అందించారని సీబీఐ అభియోగం. ఆ డబ్బులో కొంత రామచంద్ర పిళ్లైదని అనుమానిస్తున్నారు. ఆ ముడుపులతో సంబంధం ఉందంటూ.... ఇద్దర్ని అరెస్టు చేసిన అధికారులు వాటిని సమకూర్చిన వారిపై దర్యాప్తు సంస్థలు తదుపరి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

దర్యాప్తులో భాగంగా తొలుత రామచంద్ర పిళ్లై ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, ఈడీ ఆ తర్వాత క్రమంగా ఆయనతో కలిసి వ్యాపారం చేస్తున్న వారి వివరాలు సేకరించి అక్కడా సోదాలు నిర్వహించాయి. పదులసంఖ్యలో వ్యాపార సంస్థల వివరాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయి. వాటిలో జరిగిన లావాదేవీలు, వాస్తవంగా వాటి ఆదాయ వనరులను జల్లెడ పడుతున్నాయి. వాస్తవానికి ఆ సంస్థలు వ్యాపారంద్వారా ఆదాయం ఆర్జించకపోయినా నల్లధనాన్ని వాటిలోకి మళ్లించి లాభంగా చూపించారని తద్వారా అనధికారిక డబ్బును చట్టబద్ధం చేసుకున్నారని భావిస్తున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో వెలుగుచూసింది ఆ డబ్బేనని దర్యాప్తుసంస్థల అనుమానం. ఆ విషయాన్ని నిర్ధారించేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన సంస్థలన్నీ కొందరు ప్రముఖుల కుటుంబసభ్యులు, బంధుమిత్రుల పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు సమాచారం. దీంతో మద్యం ముడుపులతో ప్రత్యక్షంగా సంబంధం ఉందని భావిస్తున్న సంస్థల్లో అధికారికంగా ఉన్న భాగస్వాములపై త్వరలో చర్యలు ఉండవచ్చని.. వారికి నోటీసులు ఇచ్చి దిల్లీ పిలిపించవచ్చని తెలుస్తోంది.

ఇదీ చూడండి:KCR National Party: దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details