తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బయోగ్యాస్, సోలార్ వ్యక్తిగత ప్లాంట్ల నిర్మాణ లబ్ధిదారుల పేరిట మంజూరైన రాయితీ సొమ్మును కొట్టేసిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమార్కుల సంఖ్య పెరుగుతోంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే నలుగురు నిందితుల్ని సీఐడీ పోలీసులు కటకటాల్లోకి పంపగా.. తాజాగా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏజెంట్లుగా..
లబ్ధిదారుల్ని ప్లాంట్ల నిర్మాణానికి సమాయత్తం చేసి అవగాహన కల్పించాల్సిన స్థానంలో ఉన్న బయోగ్యాస్ డెవలప్మెంట్ ఏజెంట్ పాత్ర నిగ్గు తేలగా న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరంతా 2014 -16 కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏజెంట్లుగా పని చేసిన సమయంలో ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.
సింహభాగం మేనేజర్లకే వాటాలు..
ఏజెంట్లు కొట్టేసిన రాయితీ సొమ్ములో సింహభాగం వాటాల్ని సంస్థ జిల్లా మేనేజర్లకే పంచినట్లు సీఐడీ బృందం గుర్తించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరుపుతున్న తనిఖీల క్రమంలో ఈ వ్యవహారమంతా బహిర్గతమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేనేజర్ ప్రకాశ్ పోలీసులకు చిక్కగా.. మరో కీలక నిందితుడైన కరీంనగర్ అప్పటి మేనేజర్ కోసం గాలిస్తున్నారు.