Kodi Pandalu 2022 in Andhra Pradesh: ఆయన ఓ ప్రజాప్రతినిధికి స్వయంగా వియ్యంకుడు. ఆయన ఆధ్వర్యంలో ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ఓ మామిడితోటలో కోడిపందేలకు బరి సిద్ధం చేశారు. ఈనెల 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి సంబరాలు అంటూ కోడి పుంజులు ఢీకొట్టే చిత్రాలు, స్థలం, సంప్రదించాల్సిన చిరునామాలు, ఫోన్‌నంబర్లతో కరపత్రాలు, వాట్సప్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మా వద్ద రొయ్యలు, మెత్తల్లు, చేపలు, మటన్, చికెన్ తదితర వంటకాలతో మాంసాహారం లభించును అంటూ ట్యాగ్‌లైన్ పెట్టి మరీ ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఈ బరికి సమీపంలో అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం.
- కొల్లేరు సరస్సులోని లంక గ్రామానికి చెందిన ఓ చేపల వ్యాపారి భైరవపట్నంలో జరిగే కోడిపందేల కోసం ఒక్కో పుంజుకు రూ.3లక్షల వెచ్చించి మూడు కొనుగోలు చేశాడు. ఒక్కో పుంజుపై హీనపక్షం రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు ఉంటేనే బరిలోకి దించుతాడట! వీటి పోరు కోసం స్థానికులు, పందెంరాయుళ్లు ఆత్రుతగా ఉన్నారు. కొల్లేరు ప్రాంతంలోనే మరో వ్యాపారి రూ.50 వేలు చొప్పున 15 కోళ్లు కొనుగోలు చేసి సిద్ధం చేశారు.
- కొల్లేరు లంక గ్రామాల్లో పలుచోట్ల పందేల నిర్వహణకు వేలం వేశారు. గరిష్ఠంగా ఓ గ్రామంలో రూ.9 లక్షలకు సొంతం చేసుకున్నాడో వ్యక్తి. పందెం కాసిన వ్యక్తుల నుంచి 10శాతం కమీషన్ ఈ నిర్వాహకుడికి దక్కనుంది. బరి సమీపంలో పేకాట, గుండాట, మాంసం, మద్యం దుకాణాలకు అదనపు సొమ్ము వసూలు చేస్తారు. ఐస్‌క్రీం బండి పెట్టాలన్నా ఇతని అనుమతి కావాల్సిందే.