రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటిదశలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 2లక్షల 90వేల మంది హెల్త్‌వర్కర్లు వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. పంపిణీలో ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో అధికారులకు మార్గదర్శకాలు అందించారు. ఇప్పటికే హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డ్రైరన్ నిర్వహించిన ప్రభుత్వం.. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1200 వ్యాక్సిన్ సెంటర్లలో మరోసారి నిర్వహించబోతోంది.
వ్యాక్సిన్ పంపిణీ సాఫ్ట్‌వేర్ ఆధారితం కావడంతో... విద్యుత్, అంతర్జాలం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహిస్తున్నామని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా, మండల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ నిల్వల కోసం రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 3 కోట్ల డోసులు నిల్వసామర్థ్యానికి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి వాకింగ్ కూలర్స్, డీఫ్రీజర్స్, ఐఎల్ఆర్లు రానున్నాయని అధికారులు తెలిపారు.