భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పూర్తయ్యాయని దుర్గగుడి ఛైర్మన్ తెలిపారు. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు దీక్ష విరమణలుంటాయని ఆలయ ఈవో చెప్పారు. ఈ ఏడాది కరోనా కారణంగా రోజుకు 10వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతినిస్తుట్లు అధికారులు తెలిపారు. గిరిప్రదక్షణ, కేశఖండన, నదీస్నానాలకు అనుమతిలేదన్నారు. మాలలను స్థానికంగా ఉన్న గురుస్వాముల వద్ద విరమణ చేసుకోవాలని అధికారులు సూచించారు.
క్యూలైన్ల ఏర్పాట్లు పూర్తైందని దుర్గగుడి ఛైర్మన్ తెలిపారు. ఆలయ పాలకమండలి, అధికారులు సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. దీక్షల విరమణకు సంబంధించి ప్రెస్‌నోట్ రిలీజ్ చేశామని.. ప్రజలకు తెలియజేయాల్సిందిగా మీడియాని కోరారు.
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారు కొవిడ్ పరీక్షలు చేయించుకుని రావాల్సిందిగా ఆలయ ఈవో కోరారు. భక్తులు సహకరించాలని.. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. website: www.kanakadurgamma.org , Mobile App: kanakadurgammaలో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు. అమ్మవారి దర్శనానికి ఉదయం నాలుగు నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. మొదటి రోజున మాత్రం ఉదయం 5:30 గంటలకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు. చండీహోమంలో పాల్గొనే భక్తులకు ఇంటికే ప్రసాదాలు పంపిస్తామన్నారు. హోమానికి సంబంధించిన టికెట్లు వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని కోరారు.