తెలంగాణ రాష్ట్ర సమితికి కీలకంగా మారిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, పట్టభద్ర ఎమ్మెల్సీల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇచ్చే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నల్గొండ జిల్లా హాలియాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో సాగర్‌లో ఉప ఎన్నికలు జరగనుండగా.. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తెరాస పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 13 ఎత్తిపోతల పథకాలు, వివిధ అభివృద్ధి పనులను మంజూరు చేసిన సీఎం.. తానే స్వయంగా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్ చేరుకునే కేసీఆర్.. అక్కడ డ్యామ్‌ను పరిశీలించి, ఇంజినీర్లతో మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో నిర్వహించే తెరాస బహిరంగసభలో ప్రసంగిస్తారు.
కృతజ్ఞత సభగా..
ఉమ్మడి నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ ఆయకట్టు, నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనులపై సీఎంకు కృతజ్ఞత సభగా తెరాస దీనిని పేర్కొంటోంది. ప్రధానంగా సాగర్ ఎడమ కాల్వ అభివృద్ధి ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ఫ్లోరైడ్ నుంచి విముక్తం చేయడంతో పాటు కొత్తగా ఎత్తిపోతల పథకాలు, డిగ్రీ కళాశాల ఇతర పనులను ఎన్నికల అస్త్రాలుగా తెరాస ప్రచారం చేయనుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి సభ ఏర్పాట్లను చేయించగా... శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ సభకు కార్యకర్తలు, రైతులు, ప్రజలను సమీకరిస్తున్నారు.