Maharashtra ex servicemens joined in BRS Party : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీర్ పిలుపుతో దేశ సైనికులు బీఆర్ఎస్తో చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. దేశాన్ని కాపాడేందుకు ఇన్నాళ్లు దేశ సరిహద్దుల్లో పని చేసిన మాజీ జవాన్లు నేడు బీఆర్ఎస్ వేదికగా కిసాన్తో జత కట్టారు. జై జవాన్, జై కిసాన్ నినాదానికి సంపూర్ణ అర్థాన్నిచ్చే దిశగా ఐక్యత చాటారు. మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Army Soldiers joined in BRS Party : వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగాలని మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పిలుపునందుకొని రైతు రాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని అన్నారు. ఇది దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు సూచన అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మరోసారి వీర సైనికుల కర్తవ్యం కొనసాగించాలి : మహారాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సైనికాధికారులకు సీఎం స్వాగతం పలికారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం కేసీఆర్ వారికి వివరించారు. మహారాష్ట్రలో వీటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదం చేసే దిశగా మరోసారి వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాసిక్ జిల్లాకు చెందిన ఫౌజీ జనతా పార్టీ కార్యదర్శి, ప్రజాదరణ కలిగిన మాజీ సైనికుడు సునీల్ బాపురావు పగారె పార్టీలో చేరారు.