కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా నేటి నుంచి పది రోజుల పాటు హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఏవోసీ మార్గం ద్వారా వెళ్లే బొల్లారం, తిరుమలగిరి, మారేడ్పల్లి దారులను మూసేస్తున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం మూలంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
పదిరోజులు కంటోన్మెంట్‌లో ఏవోసీ మార్గాలు బంద్ - hyderabad news
హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఏవోసీ మార్గం ద్వారా వెళ్లే దారులను మూసేస్తున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. పదిరోజులపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
బొల్లారం, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్పల్లి, సికింద్రాబాద్, కార్ఖానా వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వల్ప దూరం వెళ్లే ప్రయాణికులు సైతం చుట్టూ తిరిగి రావడం వల్ల సమయం వృథా అవడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. కేవలం అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను తప్ప మిగిలిన వాహనాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పదిరోజులపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని కోరారు.