Army Day Exhibition: 1949లో జనవరి 15న కరియప్ప అనే భారతీయుడు తొలిసారిగా దేశ సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఏటా జనవరి 15న ఆర్మీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో రణక్షేత్రంలో సైనికులు వాడే ఆయుధాలు, యుద్ద ట్యాంకర్లు, వాతావరణ పరిస్థితులను తెలియజేసే పరికరాలు, అత్యాధునిక కమ్యునికేషన్ వ్యవస్థ వంటివి ప్రదర్శిస్తున్నారు.
సైనికులు యుద్ధం సమయంలో ఉపయోగించే 30 ఎంఎం ఆటోమేటిక్ గ్రనేడ్ సిస్టం, 84-ఎంఎం రాకెట్ లాంచర్, బైనాక్యూలర్, 40-ఎంఎం బ్యారెట్ గ్రనేడ్ లాంచర్, 7.62 ఎంఎం ఎన్ఈజీవీ, 5.56 ఎంఎం ఇన్సాస్ లైట్ మిషిన్ గన్, అసాల్ట్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్ వంటి 14 రకాల ఆయుధాలు ప్రదర్శనలో కొలువుదీరాయి. రెండు రోజులపాటు పరేడ్ మైదానంలో ఈ ప్రదర్శన కొనసాగనుంది. ప్రజలు అందరూ ప్రదర్శనను తిలకించవచ్చని సైనిక అధికారులు తెలిపారు.