Arguments In Supreme Court In Case Of Baiting MLAs: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే.. సుమారు గంటన్నరపాటు.. వాదనలు కొనసాగించారు. ఈ కేసులో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు నిందితులుగా ఉన్నారని.. అలాంటి కేసును సీబీఐకి అప్పగిస్తే.. అధికార పార్టీకి వ్యతిరేకంగా దర్యాప్తు చేయగలదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో నేరం జరిగిందని.. 5 గంటల వీడియో రికార్డింగ్ ఉందని.. అలాంటి కేసుపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయకూడదా అని దవే వాదించారు.
కేసులో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేదని.. పార్టీ అధినేతగా.. కుట్రలను ప్రజలకు వివరించారని చెప్పారు. ఫిర్యాదుదారు ఇంట్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు ముఖ్యమంత్రికి ఎలా చేరాయన్నదే ఇక్కడ ప్రశ్న..? అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకుని.. ప్రశ్నించారు. 2022 అక్టోబర్ 27నే ఆధారాలు మేజిస్ట్రేట్‌కు సమర్పించారని.. ఆ రోజు రాత్రి సీఎం మాట్లాడారన్నారు. అందువల్ల అది విచారణలో జోక్యం చేసుకున్నట్లు కాదు అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రే సీడీలను న్యాయమూర్తులకు పంపితే ఎలా?: దర్యాప్తు సంస్థలే అన్ని విషయాలు బయటకు చెబుతున్నాయని.. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కేసులోనూ ఇదే జరిగిందని దవే వాదించారు. జస్టిస్ గవాయి జోక్యం చేసుకుంటూ.. అలాంటివి ఉంటే సదరు దర్యాప్తు సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. సీడీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపడం సరైందేనా? అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. అది తప్పని.. ముఖ్యమంత్రిని అడగకుండానే.. తాను క్షమాపణలు చెబుతున్నట్లు దుష్యంత్ దవే పేర్కొన్నారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి సీడీలు రావడం తమకు అసౌకర్యం అని జస్టిస్ గవాయి స్పష్టంచేశారు. అధికారంలో ఉన్న వ్యక్తి అలా చేయడం వల్లే.. సింగిల్ జడ్జి ఆ నిర్ణయం తీసుకున్నారని.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే అలా ప్రవర్తిస్తే.. ఎలా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అలా జరిగి ఉండాల్సింది కాదని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అన్నారు.
సిట్‌తోనే విచారణ జరిపించాలి: పిటిషనర్లు కేసు దర్యాప్తును సీబీఐతో మాత్రమే దర్యాప్తు జరపాలని కోరలేదని.. ఏ సంస్థకైనా ఇవ్వమన్నారు. హైకోర్టు సింగిల్ జడ్జి కళ్లు మూసుకొని సీబీఐ దర్యాప్తునకు అప్పగించవచ్చా..? ఆ సంస్థ నేరుగా బీజేపీ నియంత్రణలో ఉందన్న విషయాన్ని పట్టించుకోకుండా అలా ఇవ్వొచ్చా...? అని దుష్యంత్ దవే అన్నారు. జస్టిస్ గవాయి స్పందిస్తూ.. సీబీఐ నేరుగా బీజేపీ నియంత్రణలో ఉందని చెబుతున్నట్లుగానే.. సిట్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది కదా..? అని ప్రశ్నించారు. అందుకు దుష్యంత్ దవే స్పందిస్తూ నేరం తెలంగాణలో జరిగింది కాబట్టి దానిపై దర్యాప్తు జరిపే హక్కు సిట్‌కు ఉంటుందన్నారు.