Supreme Court ON SIT : తెలుగుదేశం ప్రభుత్వనిర్ణయాలపై సిట్ ఏర్పాటును కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సిట్ ఏర్పాటుపై హైకోర్టు విధించిన 'స్టే' ఎత్తివేసి తదుపరి విచారణకు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై.. రెండోరోజు సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్ధ దవే, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
సీఐడీ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని దవే కోర్టుకు తెలపగా.. విస్మయం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు స్టే విధించినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. 2020 మార్చి 20న సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని న్యాయవాది తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయలేదని, అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని పున:సమీక్షించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందన్నారు.