Argument Between Revanth Reddy And Uttam Kumar Reddy : ఎన్నికల టికెట్ల విషయంలో గాంధీభవన్‌లో జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (PEC) సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల విషయంలో వీరిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని తాను ఎప్పటికీ చెప్పబోనన్న రేవంత్.. ఈ విషయంపై హైకమాండ్ చూసుకుంటుందని తెలిపారు.
పార్టీలో రెండు టికెట్ల విషయంపై పీసీసీ అధ్యక్షుడిగా హైకమాండ్‌కు రేవంత్ రెడ్డినే చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తనకు ఏ విషయంపై డిక్టేట్ చేయవద్దని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతలో సమావేశం నుంచి ఉత్తమ్ కుమార్ ఆగ్రహంగా వెళ్లిపోయారు. మరికొంత మంది సభ్యులు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Pradesh Election Committee Meeting Today : అంతకు ముందు సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వచ్చిన దరఖాస్తులపై చర్చ జరిగింది. పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల ఎంపిక కోసం వారి పూర్తి వివరాలను పరిశీలించడం జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతో దరఖాస్తుదారులకున్న అనుబంధం, పార్టీలో చేరిన తేదీ, దరఖాస్తు చేసుకున్న తేదీ, పాల్గొన్న పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన సమచారాన్ని... దరఖాస్తులో పొందుపరచిన వివిధ అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ నివేదికలను గాంధీభవన్‌లో సెప్టెంబరు 2 జరగనున్న పీఏసీ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు.