అదానీ సంస్థల వ్యవహారం, రాష్ట్రంలో ఐటీ దాడులపై శాననసభలో కాసేపు బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రధానమంత్రి సన్నిహితులకు చెందిన సంస్థలపై ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని.. కష్టపడి ఎదిగిన వారిని బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు ఎదురుదాడి చేసే క్రమంలో సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవేనని వివేకానందగౌడ్ విమర్శించారు.
''రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవే. దేశంలో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ అభివృద్ధి జరగడం లేదు. రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు చేస్తున్నారు. కేంద్రం అదానీ లాంటి వాళ్లకు లబ్ధి చేకూరుస్తోంది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలు రాష్ట్ర ప్రగతికి అద్దం పడుతున్నాయి.''- ఎమ్మెల్యే వివేకానందగౌడ్
KTR Reaction to the Hindenburg Report : అదానీ సంస్థల వ్యవహారంపై ఇటీవల మంత్రి కేటీఆర్ సైతం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విటర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. అదానీ గ్రూప్ స్టాక్‌ల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి..? ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారు? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన ప్రశ్నలు ఇవి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Kavita reaction to the Hindenburg Report :ఎమ్మెల్సీ కవిత సైతం ఈ విషయంపై గతంలో స్పందించారు. అమెరికాకు చెందినహిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడైన తర్వాతే ఎల్ఐసీ, ఎస్‌బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడుదొడుకులు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని కవిత పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ప్రతీ ఒక్క భారతీయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. దీనిపై నెలకొన్న అన్ని సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మిలియన్ల మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరఫున మాట్లాడాలని కవిత విజ్ఞప్తి చేశారు.