దేశ శక్తి అవసరాలు దాదాపుగా సంప్రదాయ వనరులపైనే ఆధారపడి ఉన్నాయి. బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గడం, జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ కారణాలు అడ్డురావడం లాంటి కారణాలతో సంప్రదాయ శక్తి వనరులను దీర్ఘకాలం వినియోగించటం సవాలుగా మారుతోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ వనరుల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల పవన విద్యుత్(wind power) ఉత్పత్తవుతోంది. వికారాబాద్ అనంతగిరి హిల్స్ వంటి ప్రాంతాల్లో సుమారు వంద మెగావాట్ల వరకు ఈ రకమైన విద్యుత్‌ను పలు సంస్థలు తయారు చేస్తున్నాయి. తాజాగా... సోలార్ పవర్ మాదిరిగానే విండ్ పవర్‌ను ఇళ్లపైనే ఉత్పత్తి చేసుకునేలా ప్రత్యేక టర్బైన్లు వచ్చాయి. సౌర విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన ఎండనే కాదు.. పవన విద్యుత్తుకు అవసరమైన మేర గాలులు అన్నిచోట్ల వీస్తుంటాయి. ప్రధానంగా నగరాల్లో భవనాలపై దీనికి అనువైన పరిస్థితులు ఉండటంతో.... ఆ దిశగా ఉత్పత్తికి ప్రత్యేక విండ్ టర్బైన్లను రూపొందించింది .... ఆర్కెమెడిస్ గ్రీన్ ఎనర్జీస్ సంస్థ(wind mill power).
ఇంటికి కావాల్సిన దానిలో సగం వరకు గాలితోనే..
తక్కువ స్థలంలో ఈ విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసుకునేలా... ఆర్కెమెడిస్ సంస్థ రూపొందించింది. ఏడాదంతా వీచే సగటు గాలి వేగంతో ఒక కిలోవాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. రోజువారి ఇంటికి అవసరమైన కరెంట్ వినియోగంలో సగం వరకు గాలి ద్వారానే ఉత్పత్తి చేసుకోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో దీనిని తయారు చేస్తున్నారు.
గాలి ఎటువీస్తే అటు తిరుగుతుంది
వృత్తాకార బ్లేడ్లను కలిగి ఉన్న ఈ కొత్త రకం విండ్ టర్బైన్‌కు... ఒకదానికొకటి చుట్టి, ఆపై విస్తరించిన మాదిరిగా రెక్కలు అమర్చబడి ఉంటాయి. సముద్రపు ఒడ్డున కన్పించే పొడుగు పెంకుల మాదిరిగా శంఖాకారంలో ఈ టర్బైన్ ఉంటుంది. ప్రత్యేక డిజైన్ కారణంగా గాలి టర్బైన్‌లోకి లాగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని తయారీసంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సెకనుకు 0.9 నుంచి 14 మీటర్ల తక్కువ వేగంతో వీచే గాలుల నుంచి సైతం ఇది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని వివరిస్తున్నారు. 360 డిగ్రీలు తిరుగుతున్నందున గాలి వీచే దిశను బట్టి దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. సెకనుకు 22 మీటర్ల అధిక గాలులను సైతం టర్బైన్ తట్టుకుని నిలబడేలా దీనిని రూపొందించారు.
ఆర్కెమెడిస్ విండ్ టర్బైన్ అనేది అతి తక్కువ గాలి తీసుకుని దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. పెద్ద విండ్ టర్బైల్ పెడితే దానికి స్టాండ్ ఏర్పాటు చేసి ఎత్తులో పెట్టాల్సి ఉంటుంది. కానీ... దీని విషయంలో ఏమింటంటే మన భవనాలనే వాడుకునేలా.. రూఫ్ టాప్ అనే కాన్సెఫ్ట్‌తో దీనిని రూపొందించాము. పునరుత్పాదక విద్యుత్ అనేది ప్రతిరోజు ఎంత ఉత్పత్తి అవుతుందనేది చూడరు. దానిని సంవత్సారానికి సగటున తీసుకుంటాము. సోలార్ విద్యుత్ అనేది రోజు మూడు నాలుగు యూనిట్లు ఇస్తుందని చెబుతున్నారో దానిని కూడా సంవత్సరానికి సగటున లెక్కించి చెబుతున్నారు. విండ్ ఎనర్జీ అనేది సోలార్ కంటే కూడా కచ్చితంగా ఎక్కువనే ఉంటుంది.- సూర్యప్రకాశ్, ఆర్కెమెడిస్ రూఫ్‌టాప్ విండ్ టర్బెన్ సీఈవో