తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!

చలికాలం...ఆంధ్రా ఊటీకి పయనం...అరకు ఘాట్ రోడ్డులో చుట్టూ పచ్చని చెట్లు..ఎత్తైన కొండలు ఎక్కే కొద్దీ... వణుకు ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో వేడి వేడి కాఫీ తాగితే...ఆహా ఆ మజానే వేరు. అలాంటిది గిరిజనులు చేతి కాఫీ తాగితే వచ్చే కిక్కు చెప్పనక్కర్లేదు.

అరకులో ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!

By

Published : Nov 15, 2019, 10:00 AM IST

అరకులో ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!

విశాఖ మన్యం అంటే ముందుగా గుర్తొచ్చేది అరకు అందాలు. ఇరుకైన ప్రయాణ మార్గాలు. వెళ్లినవారెవరైనా ప్రకృతికి ఫిదా అవ్వాల్సిందే. ప్రతి మది పులకరించాల్సిందే. అంతలా ఇక్కడి అందాలు కనువిందు చేస్తాయి. అందరినీ కట్టిపడేస్తాయి.

ఆంధ్రా ఊటీగా పేరొందిన ఊటీలో కాఫీకి ప్రత్యేకత ఉంది. చల్లని వేళల్లో వేడి వేడి కాఫీని గొంతులోకి పోస్తుంటే వచ్చే మజా మాటల్లో చెప్పలేనిది. ప్రతి గుటకలోనూ సరికొత్త రుచి పరిచయమవుతుంది. పొగలు కక్కే కాఫీ ఘుమఘుమలకు చలి పులి పరార్‌ కావాల్సిందే.

అరకు మార్గంలో కనిపించే గిరిజన కాఫీ దుకాణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో ఈ మన్యం కాఫీ స్టాల్స్ కట్టెల పొయ్యిపై వేడి వేడి కాఫీ తయారు చేస్తూ ఆంధ్రా ఊటీకి స్వాగతం పలుకుతాయి.

గిరిజనులు తయారు చేసే ఈ కాఫీ రుచి చూద్దామని...ఆగే ప్రతి ఒక్కరికీ కాసేపు ప్రకృతితో చేరువగా గడిపే అవకాశం దక్కుతుంది. కాఫీ దుకాణాలకు వెనకవైపు ఎత్తైన సిల్వర్ ఓక్ చెట్ల మధ్య ఉండే కాఫీ తోటలు చూడొచ్చు.

ప్రకృతి రమణీయత మధ్య ఫొటోలు దిగుతూ మురిసిపోవచ్చు. అరకు అందానికి...ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని సందర్శకులు చెబుతున్నారు. కాలమేదైనా అరకు పర్యటకులతో సందడిగా కనిపిస్తోంది. పచ్చని చెట్లు, కొండల మధ్య అరకు అందాలు అడుగడుగునా స్వాగతం పలుకుతుంటాయి.

ABOUT THE AUTHOR

...view details