పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువతులు, బాలికల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వివాహాలు చేసుకుని అనంతరం వదిలేసి వెళ్లిపోతున్న అరబ్‌షేక్‌లు కొద్దినెలలు విరామమిచ్చి తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టారు. పాతబస్తీలో రెండేళ్ల క్రితం షేక్‌ల అక్రమ నిఖాల బాగోతం తెరపడిందన్న భావనతో పోలీసులు వీటిపై దృష్టి సారించడం లేదు. తాజాగా మూడు రోజుల క్రితం బహ్రెయిన్ దేశస్థుడు ఎబ్రాహిం షుక్రల్లా మొహమ్మద్ బైరమిపై పాతబస్తీకి చెందిన యువతి తనపై లైంగికదాడి చేశాడని ఫిర్యాదు చేయడం.. చాంద్రాయణగుట్ట పోలీసులు విచారణ చేపట్టడం వల్ల నిఖా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
సాబేర్ దంపతులే కీలక పాత్రధారులు
ఎబ్రాహిం నుంచి డబ్బులు తీసుకున్న దళారీ మహ్మద్ సాబేర్, అతడి భార్య సమీనా కీలక పాత్రధారులని గుర్తించారు. వీరిద్దరూ కొన్ని నెలల నుంచి అరబ్ షేక్‌లతో మాట్లాడుతూ వారికి నగరంలోని యువతులతో పెళ్లిళ్లు చేయిస్తున్నారని పోలీసులకు ఆధారాలు లభించగా.. ప్రత్యేక విభాగం అధికారులు, పోలీసులు దొంగ వివాహాలపై దృష్టి సారించారు.
డబ్బులొస్తాయంటూ బలవంతం..
అరవై ఏళ్ల ఎబ్రాహిం.. ఆరు నెలల క్రితం తాను రెండో పెళ్లి చేసుకుంటానని, పాతికేళ్లలోపు యువతితో నిఖా చేయించాలని నబీల్ కాలనీలో ఉంటున్న మహ్మద్ సాబేర్‌కు ఫోన్ చేశాడు. అమ్మాయి తయారుగా ఉందని చెప్పగా 2019 అక్టోబరులో నగరానికి వచ్చాడు. అదేరోజు అంబర్‌పేటకు చెందిన ఓ యువతితో సాబేర్ నిఖా చేయించాడు. నాలుగైదు రోజులున్న తర్వాత ఎబ్రాహిం బహ్రెయిన్‌కు వెళ్లిపోయాడు. షేక్‌ను పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే నగదు ఇస్తానంటూ అంబర్‌పేట యువతిని సాబేర్ బలవంతం చేయగా ఆమె ఆ వివాహానికి ఒప్పుకొంది. అతను బహ్రెయిన్‌కు వెళ్లగానే ఆమె ఇంటికి వెళ్లిపోయింది.
తన రెండో భార్యను తీసుకెళ్తానంటూ గత నెల 25న ఎబ్రాహిం తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. సాబేర్ సలహాతో బార్కస్ సలాలా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సాబేర్ అదేరోజు అరబ్‌షేక్‌తో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె సోదరిని ఎబ్రాహిం నివాసానికి తీసుకువచ్చాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా.. ఆ యువతి తిరస్కరించింది. దీంతో సాబేర్ భార్య ఫాతిమా రంగప్రవేశం చేసి యువతిని మళ్లీ తీసుకొచ్చి అరబ్‌షేక్ ఇంట్లో వదిలేసింది. అప్పటి నుంచి మూడు రోజుల పాటు ఎబ్రాహిం ఆమెపై లైంగికదాడి కొనసాగించాడు. బాధితురాలి సోదరికి విషయం తెలిసి సాబేర్‌ను నిలదీయడం.. వారు బాధితురాలి ఆచూకీ తెలపగా మూడు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.