తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతి స్పెషల్.. ప్రయాణికులకు ఏపీఎస్​ఆర్టీసీ బంపర్​ ఆఫర్​

APSRTC Sankranti Special Offer : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆ​ర్టీసీ సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. ప్రయాణికులకు రాయితీలను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నిర్ణయంతో.. ఇప్పటికే పండుగ ముందు, తర్వాతి రోజుల్లో సీట్లన్నీ నిండిపోయి..వెయిటింగ్ లిస్ట్‌ కనిపిస్తోంది. మరోవైపు..ఎంతమంది ప్రయాణికులు వచ్చినా బస్సులు వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

APSRTC
APSRTC

By

Published : Jan 4, 2023, 2:14 PM IST

APSRTC Sankranti Special Offer : సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈసారి 6వేల 400 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈనెల 6 నుంచి 14 వరకు 3,120 బస్సులు... పండుగ తర్వాత ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకూ 3,280 బస్సులు నడుపుతోంది. సాధారణంగా నడిపే బస్సులకు అదనంగా ఈ బస్సులు నడుపనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50శాతం ఛార్జీల వసూలును పక్కన పెట్టింది.

ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి 3,600 బస్సులు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 800 బస్సులు , విశాఖపట్నానికి 450, రాజమహేంద్రవరానికి 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు.

"సాధారణ ఛార్జీ ప్రకారం బస్సులు నడుపుతున్నాం. ఇదే కాకుండా రాయితీలు కూడా ఇస్తున్నాం. ఉదాహరణకు ఐదుగురు వ్యక్తులు టికెట్​ బుకింగ్​ చేసుకుంటే 5% తగ్గింపు, అలా కాకుండా రిటన్​ టికెట్స్​ బుక్​ చేసుకుంటే 10% రాయితీ ఇస్తున్నాం. అదీ కాకుండా 25% రాయితీలు వృద్ధులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకూ 65శాతం టికెట్లు బుక్​ అయ్యాయి" -బషీర్ అహ్మద్, డిప్యూటీ సీటీఎం, విజయవాడ

గతంలో పండుగలు, ప్రత్యేక రోజుల్లో 50శాతం అదనంగా వడ్డించిన ఆర్టీసీ..ఈసారి రాయితీలనూ ప్రవేశపెట్టింది. అన్ని దూర ప్రాంత సర్వీసుల్లో రాను పోను టికెట్లు ఒకేసారి బుకింగ్ చేసుకుంటే టికెట్ చార్జీలో 10 శాతం రాయితీ కల్పించింది. వీటితో పాటు మరో ప్రత్యేక ఆఫర్ ను ప్రయాణికుల కోసం తీసుకువచ్చింది. ఐదుగురు ప్రయాణికులు ఒకేసారి టికెట్ బుకింగ్ చేసుకుంటే వారికి 5శాతం రాయితీ అమలు చేస్తోంది. ప్రైవేటు బస్సుల్లో వెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని అధికారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details