తెలంగాణ

telangana

ETV Bharat / state

LIQUOR MALLS: ఆ రాష్ట్రంలో మద్యం నిషేధం హామీ గాలికి

మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా విక్రయాల పెంపుపై దృష్టి సారించింది. ధర తక్కువ ఉండే 90 ఎంఎల్‌ సీసాలను రోజుకు కనీసం 10వేల కేసులను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మరో 70 మద్యం మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపీఎస్‌బీసీఎల్‌ రంగం సిద్ధం చేసింది.

LIQUOR MALLS
మద్యం నిషేధం హామీ గాలికి

By

Published : Sep 6, 2021, 9:10 AM IST

ఆంధ్రప్రదేశ్​లో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా విక్రయాల పెంపుపై దృష్టి సారించింది. రూ.80 నుంచి రూ.100 మధ్య ధరకు 90 మిల్లీలీటర్ల (ఎంఎల్‌) పరిమాణంలో ఉండే సీసాలను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు కనీసం 10వేల కేసులను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. క్రమంగా ఈ లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించింది. తక్కువ పరిమాణమున్న మద్యాన్ని తక్కువ ధరలో లభ్యమయ్యేలా చేయడం ద్వారా ఎక్కువ మంది కొనేలా చేసి అమ్మకాలను పెంచుకునేందుకే ఏపీఎస్‌బీసీఎల్‌ వీటిని ప్రవేశపెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఇప్పటివరకు 180 ఎంఎల్‌, అంతకంటే ఎక్కువ పరిమాణంలోని సీసాలే అందుబాటులో ఉన్నాయి. ఇవి రోజుకు సగటున 50 వేల కేసులు అమ్ముడవుతున్నాయి. 90 ఎంఎల్‌ సీసాలతో అదనంగా మరో 20-30% కేసులు ప్రతిరోజూ అమ్ముడయ్యే అవకాశముంది. తద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించనుంది.

ఊరూరా వాక్‌ఇన్‌ స్టోర్లు

ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మరో 70 మద్యం మాల్స్‌ను (ఎలైట్‌ వైన్‌ వాకిన్‌ స్టోర్స్‌) ఏర్పాటు చేసేందుకు ఏపీఎస్‌బీసీఎల్‌ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే విజయవాడ, నెల్లూరు, భీమవరం, కాకినాడ తదితర నగరాల్లోని 31 వాకిన్‌ స్టోర్స్‌ నుంచి గణనీయ ఆదాయం లభిస్తుండటంతో ఈ నెలాఖరులోగా మిగతాచోట్ల ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణ మద్యం దుకాణం ఒక్కోటి ప్రస్తుతం రోజుకు సగటున రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మద్యం విక్రయిస్తోంది. ధర ఎక్కువున్న బ్రాండ్ల మద్యం లభ్యమయ్యే ఒక్కో వాకిన్‌ స్టోర్‌లో.. రోజుకు సగటున రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల మద్యం విక్రయమవుతోంది. ప్రస్తుతమున్న 31 వాకిన్‌ స్టోర్స్‌ ద్వారా రోజుకు ఏపీఎస్‌బీసీఎల్‌కు సగటున రూ.2.40 కోట్ల ఆదాయం వస్తోంది. మొత్తం వాకిన్‌ స్టోర్స్‌ ద్వారా నెలకు రూ.240 కోట్ల ఆదాయం రాబట్టాలనేది ఏపీఎస్‌బీసీఎల్‌ అంచనా

సారా బూచిని చూపుతూ...

ప్రస్తుతం గ్రామాల్లో రూ.100కే పావు లీటరు సారా లభిస్తోందని, అదే ధరకు మద్యం అందుబాటులో లేకపోవడంతో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారని.. ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. అందుకే 90 ఎంఎల్‌ సీసాలను తీసుకొస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. మద్య నిషేధమే ప్రభుత్వ లక్ష్యమైనప్పుడు సారా నియంత్రణకు చర్యలు చేపట్టాలేగానీ బదులుగా మద్యం తాగడాన్ని ప్రోత్సహించేలా ధర, పరిమాణం తక్కువుండే సీసాలు తేవడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అమ్మకాలు పెంచేందుకు బీర్‌ క్యాన్లు

తంలో రోజుకు సగటున 56 వేల కేసుల బీర్లు అమ్ముడయ్యేవి. ఇప్పుడా సంఖ్య 15 వేలకు పడిపోయింది. ప్రస్తుతం 630 ఎంఎల్‌ బీరు ధర రూ.200.. ఈ ధర ప్రభావంతో పాటు బాగా ప్రాచుర్యమున్న బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో విక్రయాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో 330, 500 ఎంఎల్‌ పరిమాణాల్లో బీరు క్యాన్లను అందుబాటులోకి తెచ్చి విక్రయాలను పెంచుకోవాలని ఏపీఎస్‌బీసీఎల్‌ భావిస్తోంది. 330 ఎంఎల్‌ బీరు క్యాన్‌ రూ.110కే లభిస్తుందని, తద్వారా ఎక్కువ మంది కొంటారనేది ఆ సంస్థ వ్యూహం.

ఇదీ చదవండి:Heart disease : రక్తప్రసరణ లోపాల మృతులు తెలంగాణలో 56 శాతం!!

ABOUT THE AUTHOR

...view details