ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఖాళీలు పెరిగే అవకాశం ఉందని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సభ్యుడు షేక్ సలాంబాబు వెల్లడించారు. ఇకపై జారీచేసే నోటిఫికేషన్లలో గ్రూప్-1 మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్ ఉండదన్నారు. ఈ మేరకు పూర్వ జీఓలను రద్దుచేయాలని కమిషన్ సమావేశంలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసినట్లు వెల్లడించారు. ఏపీపీఏస్సీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
‘2018లో జారీచేసిన నోటిఫికేషన్లలో గ్రూప్-1, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక పోస్టులు మినహా మిగతావాటిని భర్తీచేశాం. ఈ రెండు రకాల పోస్టుల భర్తీ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో నియామకాలు ఇంకా జరగలేదు. ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్షను నిర్వహించడం వల్ల 3 నెలల్లోనే నియామకాలను పూర్తిచేయొచ్చు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గ్రూప్-2 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ నాటికి అదనపు పోస్టుల వివరాలు కమిషన్‌కు అందుతాయి. ఇవికాకుండా వివిధ శాఖలకు చెందిన 1,180 (15 నోటిఫికేషన్లు) పోస్టుల ఖాళీల వివరాలు కమిషన్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. నోటిఫికేషన్లు జారీచేసినా భర్తీకాని పోస్టులు 325 వరకు ఉన్నాయి. వీటి భర్తీకి ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంది. జాబ్ క్యాలెండర్ అనుసరించి వచ్చే నెలలో ప్రకటనలు ఇస్తాం. ఉద్యోగాల సాధన కోసం ఏపీపీఏస్సీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులపై పోలీసు కేసులు తొలగించాలని కమిషన్ తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించాలని ప్రభుత్వానికి కమిషన్ కార్యదర్శి లేఖ రాశారు’
- షేక్ సలాంబాబు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు